AP Government | పవన్ కళ్యాణ్‌తో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల భేటీ

  • సూపర్ ఎల్ నినోపై రైతులకు అవగాహన కల్పించాలి
  • రైతులతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశాలు నిర్వహించాలి
  • సాగునీటి సంక్షోభానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచన

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నెలకొన్న సూపర్ ఎల్ నినో ప్రభావం, సాగునీటి సంక్షోభంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుసూచించారు. రైతులతో ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహించి ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నీటి వినియోగంలో జాగ్రత్తలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు వివరించాలని అన్నారు.

గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉప ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రంలోని సాగునీటి పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన నీటి కొరత, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సమీక్షించారు.

మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. కాకినాడ జిల్లా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట తదితర ప్రాంతాల రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు ఏలేరు ప్రాజెక్టు నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రతి రైతు పంట బీమా చేయించుకునేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. అలాగే నీటి వృథాను అరికట్టేందుకు కాలువల పూడిక తొలగింపు, గట్ల మరమ్మతులు, లీకేజీల నివారణ వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రతి నీటి బొట్టు విలువైనదని పేర్కొన్న ఆయన, ముఖ్యంగా కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు.

అంతకుముందు, భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.