ఆగస్టు 4న హైదరాబాద్‌లో చేనేత సహకార సంఘాల సదస్సు
చేనేత సంఘాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్
చిట్యాల, ఆంధ్రప్రభ : ఆగస్టు 4న హైదరాబాద్‌లోని ఆటోనగర్ కర్నాటి గార్డెన్స్‌లో తెలంగాణ చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులతో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ తెలిపారు. ఈ మేరకు గురువారం చిట్యాలలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాలకవర్గాలను ఘనంగా సన్మానించి సొసైటీలకు జ్ఞాపికలు అందజేయనున్నట్లు తెలిపారు.
గత 13 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదని, తెలంగాణ చేనేత కార్మిక సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో ఎన్నికలు నిర్వహించారని పేర్కొన్నారు. సొసైటీలపై ఉన్న పాత అప్పులను ఇప్పటివరకు పూర్తిగా మాఫీ చేయలేదని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలు రూ.30 కోట్లకు మించవని పేర్కొంటూ, రైతులు, ఇతర వర్గాల మాదిరిగానే చేనేత సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను కూడా ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ అధికారి వెంకటేశం హాజరై సహకార సంఘాల చట్టాలు, నిర్వహణపై సభ్యులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. చేనేత సహకార సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
త్రిఫ్ట్ ఫండ్ నిధులను వెంటనే బ్యాంకుల ద్వారా విడుదల చేయాలని, టెస్కో ద్వారా బెడ్షీట్లు, టవల్స్ తదితర చేనేత వస్త్రాల టెండర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకుండా నేరుగా చేనేత సహకార సంఘాలకే ఇవ్వాలని కోరారు. హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలకు అవసరమైన చేనేత వస్త్రాల ఆర్డర్లను కూడా చేనేత సొసైటీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణమాఫీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే చేనేత సహకార సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఏకగ్రీవంగా ఎన్నికైన సంఘాలకు ప్రత్యేక గ్రాంటు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందగట్ల గణేష్, చిట్యాల చేనేత సహకార సంఘం అధ్యక్షుడు గంజి సుధాకర్, ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు మిర్యాల వెంకటేశ్వర్లు, కోశాధికారి కోట రాంబాబు, డైరెక్టర్లు వడ్డేపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.
