అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..

  • కొత్తపేటలో ఇంటింటి ప్రచారంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ‌ : అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య కంచికచర్ల మండలం కొత్తపేట గ్రామంలో బుధవారం కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తోందన్నారు. నియోజకవర్గంలో రహదారులు, తాగునీటి సౌకర్యాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, అభివృద్ధి పనుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం వెనుకబడిందని, ప్రస్తుతం ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. ఇంటింటి ప్రచారానికి గ్రామ ప్రజలు విశేష స్పందన చూపారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.