సాయం అడిగి రెక్కీ… తాళాలు పగులగొట్టి చోరీ…

వారం రోజుల్లోనే దొరికిన దొంగ దంపతులు


మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని దొంగతనానికి పాల్పడిన దంపతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గాంధీనగర్‌కు చెందిన పలోటి యాకూబ్ జయరాజ్ ఇంటికి గుడ్లవల్లేరుకు చెందిన చుక్క వీరబాబు, శ్రీలత దంపతులు ఆర్థిక సహాయం కోరుతూ వెళ్లారు.

అయితే ఇల్లు తాళం వేసి ఉండటాన్ని గమనించిన వారు దురాలోచనకు తెరలేపారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దంపతులు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును అపహరించి పరారయ్యారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన చిలకలపూడి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో వారం రోజుల్లోనే కేసును ఛేదించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 98 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దంపతులకు సహకరించిన మరో వ్యక్తితో పాటు మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు బందరు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ నబి మీడియాకు వెల్లడించారు.