తిరువూరులో విలవిలలాడుతున్న ప్రజలు..

  • ఫాగింగ్ లేక ప్రజల అవస్థలు..
  • సీజనల్ జ్వరాలతో ఆసుపత్రులకు క్యూ
  • డ్రైనేజీల్లో నిల్వ నీరు, పేరుకుపోయిన చెత్తతో దోమల విజృంభణ
  • డెంగ్యూ, మలేరియా భయంతో ప్రజల్లో ఆందోళన
  • ఫిర్యాదులు చేసినా స్పందన లేదని మున్సిపల్ యంత్రాంగంపై విమర్శలు

తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు పట్టణంలో దోమల బెడద రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో మురుగునీరు నిల్వ ఉండటం, డ్రైనేజీలు సక్రమంగా శుభ్రం చేయకపోవడం, చెత్త పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు సీజనల్ జ్వరాలు, వైరల్ ఫీవర్ల బారిన పడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొంది.

ప్రభాళుతున్న వ్యాధులు..

డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో జ్వర బాధితుల సంఖ్య పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. పట్టణంలో దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించకపోవడంతో పాటు దోమల మందు పిచికారీ కూడా సక్రమంగా చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు.

ప్రస్తుతం ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతున్నప్పటికీ పారిశుద్ధ్య సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోమల మందు స్ప్రేయింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వినియోగించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానికులు అంటున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా మున్సిపల్ యంత్రాంగం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫాగింగ్ అవసరం..

పట్టణవ్యాప్తంగా తక్షణమే ఫాగింగ్ నిర్వహించడంతో పాటు డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, నిల్వ నీటిని తొలగించే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.