జుక్కల్ బస్‌స్టాండ్ మరమ్మతులు చేపట్టాలి
ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డీఎంకు ప్రయాణికుల వినతి
జుక్కల్, ఆంధ్రప్రభ: జుక్కల్ బస్‌స్టాండ్‌ను తక్షణమే మరమ్మతులు చేయాలని లేదా కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరారు. బుధవారం బస్‌స్టాండ్‌ను పరిశీలించేందుకు వచ్చిన బాన్సువాడ ఆర్టీసీ డీఎం రవికుమార్‌కు వారు వినతిపత్రం అందజేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన జుక్కల్ బస్‌స్టాండ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. పైకప్పు పెచ్చులు ఊడిపోవడం, వర్షం పడితే నీరు కారడం వల్ల ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
జుక్కల్ బస్‌స్టాండ్ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వర్షాకాలంలో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఏదైనా ప్రమాదం జరిగేలోపు అధికారులు స్పందించి బస్‌స్టాండ్‌ను మరమ్మతులు చేయాలని గ్రామ యువకులు డిమాండ్ చేశారు. బస్‌స్టాండ్ దుస్థితి గురించి ఆర్టీసీ అధికారులకు చాలా కాలంగా తెలిసినా, వర్షాకాలంలో ‘మరమ్మతుల్లో ఉంది.. లోనికి రావద్దు’ అనే బోర్డు ఏర్పాటు చేయడం తప్ప శాశ్వత చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ప్రయాణికుల విజ్ఞప్తిపై స్పందించిన బాన్సువాడ ఆర్టీసీ డీఎం రవికుమార్, సమస్యను పరిశీలించి త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
