స్వాతంత్ర్య వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు

రాజధాని పెరేడ్ గ్రౌండ్స్‌ను పరిశీలించిన జీఏడీ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు
వీఐపీల రాకపోకలు, ప్రజలకు సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ) ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు పెరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ, సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తదితర అధికారులు పాల్గొన్నారు.

పెరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేస్తున్న వేదిక, కవాతు ప్రాంతం, అతిథుల గ్యాలరీలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేడుకలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.

ముఖ్యంగా మంత్రులు, న్యాయాధికారులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఇతర వీఐపీల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. భద్రతా పరంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టడంతో పాటు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను సమర్థంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

అలాగే వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన కూర్చునే ఏర్పాట్లు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తగిన పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఆహ్వాన పత్రాల ముద్రణ, పంపిణీ ప్రక్రియను కూడా సమయానికి పూర్తి చేయాలని సూచించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా నిలిచే కార్యక్రమమని పేర్కొన్న ముఖ్య కార్యదర్శి, ప్రతి శాఖ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, రెవెన్యూ డివిజనల్ అధికారులు కె. శ్రీనివాసరావు, కె. శ్రీరమణి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని ఏర్పాట్ల పురోగతిపై వివరాలు అందించారు.