ఏపీలో పరిశోధన రంగానికి విదేశీ పెట్టుబడులు శూన్యం

  • లోక్‌సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నకు కేంద్రం వెల్లడి
  • ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌కు మద్దతు కొనసాగుతుందని స్పష్టం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) రంగానికి గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూవిజ్ఞాన శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా ఈ వివరాలను వెల్లడించారు.

రాష్ట్రంలో, ముఖ్యంగా తిరుపతి ప్రాంతంలో పరిశోధన రంగంలో విదేశీ పెట్టుబడుల పరిస్థితి, కొత్త పరిశోధన సంస్థల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు, పరిశోధన రంగాన్ని ప్రోత్సహించేందుకు చేపడుతున్న చర్యల గురించి ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పరిశోధన రంగానికి ఎలాంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నమోదుకాలేదని తెలిపారు. అయితే ఇదే కాలంలో రాష్ట్రానికి ఇతర రంగాల్లో కలిపి 933.86 మిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొన్నారు.

దేశంలో పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం పలు జాతీయ స్థాయి కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం, సెమికాన్ ఇండియా కార్యక్రమం, బయో-ఇ3 విధానం, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, నేషనల్ క్వాంటమ్ మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా పరిశోధన రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో లేదా తిరుపతిలో విదేశీ నిధులతో కొత్త పరిశోధన కేంద్రాలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేవని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా కొత్త కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థను ఏర్పాటు చేసే యోచన కూడా ప్రస్తుతం లేదని పేర్కొన్నారు.

అయినప్పటికీ తిరుపతిలోని జాతీయ ప్రాధాన్య విద్యాసంస్థలు ఐఐటీ తిరుపతి, ఐఐఎస్‌ఈఆర్ తిరుపతిలకు కేంద్ర ప్రభుత్వ పరిశోధన కార్యక్రమాల ద్వారా అవసరమైన సహకారం కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది.

ఈ అంశంపై స్పందించిన ఎంపీ మద్దిల గురుమూర్తి, రాష్ట్రానికి మొత్తం విదేశీ పెట్టుబడులు రావడం సానుకూల పరిణామమే అయినప్పటికీ, పరిశోధన, ఆవిష్కరణల రంగంలో ఒక్క పెట్టుబడి కూడా రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. తిరుపతిలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యా, పరిశోధన సంస్థలు ఉన్న నేపథ్యంలో, ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశీ సంస్థలు పరిశోధన కేంద్రాలను స్థాపించేలా ఆకర్షణీయమైన ప్రోత్సాహక విధానాలు రూపొందించాలని కూడా సూచించారు.