నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలి

  • తిరుపతి పార్లమెంట్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన డాక్టర్ పనబాక లక్ష్మి
  • పనుల పురోగతిపై సమీక్ష.. నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
  • ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవలందించే కేంద్రంగా కార్యాలయం రూపుదిద్దుకుంటుందని వెల్లడి

తిరుపతి, ఆంధ్రప్రభ: తిరుపతి నియోజకవర్గంలోని అవిలాల వద్ద నిర్మాణంలో ఉన్న తిరుపతి పార్లమెంట్ కార్యాలయ భవనం పనులను తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు డాక్టర్ పనబాక లక్ష్మి బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులు, ఇంజినీర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలించిన డాక్టర్ పనబాక లక్ష్మి, ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. పనులు ఆలస్యం కాకుండా నిర్ణీత గడువులో పూర్తి చేసి కార్యాలయాన్ని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో ఆధునిక సౌకర్యాలతో ఈ పార్లమెంట్ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఒకే చోట తమ సమస్యలు, అవసరాల కోసం సంప్రదించగల కేంద్రంగా ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి వేగంగా స్పందించడంతో పాటు పార్టీ కార్యక్రమాల సమన్వయానికి కూడా ఈ కార్యాలయం కీలకంగా మారుతుందని ఆమె చెప్పారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే శాశ్వత కేంద్రంగా ఇది పనిచేస్తుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని వసతులు ఇందులో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని, అందుకు అనుగుణంగా కార్యాలయం కార్యకలాపాలు కొనసాగుతాయని డాక్టర్ పనబాక లక్ష్మి తెలిపారు. నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.