తల్లికి వందనం అర్హుల జాబితా సిద్దం చేయాలి
తల్లికి వందనం అర్హుల జాబితా సిద్దం చేయాలి
విద్యాశాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న యూనిఫాంలు, పుస్తకాలు, బ్యాగుల పంపిణీకి సర్వం సిద్ధం చేయాలని ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ఉచితంగా పంపిణీ చేసే స్కూల్ బ్యాగులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, బూట్లు (షూస్) తదితర వస్తువులను అందించేందుకు అధికారులంతా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు . పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకూడదని,పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుపై దృష్టి సారించాలని తెలిపారు సర్కారు బడుల్లోని నాణ్యమైన విద్య, డిజిటల్ బోధన గురించి తల్లిదండ్రులకు విస్తృతంగా వివరించి అవగాహన కల్పించాలని సూచించారు.
తల్లికి వందనం అర్హుల జాబితా సిద్దం చేయాలి..
పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితాను పారదర్శకంగా, త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు. స్కూళ్లు తెరిచే నాటికి ప్రభుత్వ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్ధంగా ఉండాలని,విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా టాయిలెట్లు, ఆర్వో ప్లాంట్లు నిరంతరం పని చేయాలన్నారు . నిధుల కొరత లేనందున హాస్టళ్ల నిర్వహణపై ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని,.పాఠశాలలు, హాస్టళ్ల ప్రాంగణాల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలని తెలిపారు . ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా, విద్యార్థులకు అందించే నీటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు .
హాస్టళ్లలో విద్యార్థులకు అందించే ఆహారం అత్యంత నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండాలని,. ఆహార పదార్థాలు, నీటి సరఫరా విషయంలో ఏ చిన్న లోపానికీ తావు ఇవ్వకూడదని ఆదేశించారు .విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణలో ఎక్కడైనా లోపాలు జరిగి ఫిర్యాదులు వస్తే, దానికి సంబంధిత అధికారులదే పూర్తి బాధ్యత అని ఆయన హెచ్చరించారు. ఈ సమీక్ష లో జిల్లా విద్యాశాఖాధికారి రవి బాబు, తదితరులు పాల్గొన్నారు.
