నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
టెక్కలి, ఆంధ్రప్రభ : విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం కింద నాణ్యమైన భోజనాన్ని అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ను బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి మంత్రి సందర్శించారు. మెనూ ప్రకారం ఆహారం అందిస్తుంది లేనిది, వడ్డించిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. వంటకాలను స్వయంగా రుచి చూసి విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చుని సహపంక్తి భోజనాలను చేశారు.
రోజువారి మధ్యాహ్న భోజన పథకం అమలు మెనూను విద్యార్థులకు అడిగి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల్లో పౌష్టికాహారం లోపం లేకుండా మధ్యాహ్న భోజన పథకం మెనూ పక్కాగా అమలు చేయాలన్నారు . విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని అన్నారు. ఉన్నత పాఠశాల ఆవరణంలో పచ్చదనం ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బగాది శేషగిరిరావు, ఆర్డీఓ ఎమ్.కృష్ణ మూర్తి, డి ఎల్ డిఓ అలివేలు మంగ, ఎమ్ పీ డీ వో రేణుక, తాసిల్దార్ సత్యం, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి ఎమ్.సుధాకర్, మండల విద్యాశాఖ అధికారి తులసి రావు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి కె.రామ కృష్ణ, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాట్ల దాశరధి, ఉపాధ్యాయులు బి.అరుణ్ కుమార్, ఆర్. శ్రీనివాస్, రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
