మలిదశ తెలంగాణ ఉద్యమం మహోన్నతం

మలిదశ తెలంగాణ ఉద్యమం మహోన్నతం
ఆలేరు, ఆంధ్రప్రభ: మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన సబ్బండ ప్రజా ఉద్యమం ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఒక మహత్తర చారిత్రక ఘట్టమని మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కు చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆయన మంగళవారం మలిదశ ఉద్యమంలో ఆలేరు ప్రాంత నాయకునిగా అప్పటి జ్ఞాపకాలను వెల్లడించారు.
2001- 2014 మధ్య జరిగిన తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ స్ఫూర్తితో ఉద్యమకారుడిగా తాను రోడ్ల పైన అనేక నిరసన కార్యక్రమాలలో పాల్గొనగా పోలీసుల చేత పలుమార్లు అరెస్టు అయ్యానని రాజాపేట, తుర్కపల్లి పోలీస్ స్టేషన్ లకు తరలించి నిర్బంధించారని చెప్పారు. నాలుగు రైళ్లని ఆపడం ద్వారా ఆలేరులో రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించగా కేసు నమోదు చేయబడి మూడున్నర సంవత్సరాల పాటు ఖాజీపేట రైల్వే కోర్టు చుట్టూ తిరిగామని చెప్పారు.
ప్రతిపక్ష నేతగా అప్పుడు ఉన్న వైఎస్ కాన్వాయ్ ని ఈ ప్రాంతంలో అడ్డుకొని అరెస్టయ్యామని అన్నారు. విజయవాడ- హైదరాబాద్ రహదారిని నార్కెట్ పల్లి వద్ద దిగ్బంధనం చేసినప్పుడు తాము పాల్గొని లాఠీ చార్జీలో దెబ్బలు తిని గాయాల పాలైన ఘటనను మర్చిపోలేమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవసారి జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మలిదశ ఉద్యమకారులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు పరచాలని ఆయన సూచించారు. ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, పెన్షన్లు మలిదశ ఉద్యమకారుల కోసం మంజూరు చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఇటీవల నియమించిన కమిటీ ద్వారా ప్రక్రియను సత్వరమే చేపట్టాలని బాలస్వామి అన్నారు.
