మున్సిపల్ అధికారుల పేరుతో మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మున్సిపల్ అధికారుల పేరుతో మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కమిషనర్ రాజశేఖర్ రెడ్డి
జనగామ అర్బన్, ఆంధ్రప్రభ:
జనగామ జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారుల పేరుతో కొందరు వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి సూచించారు.
గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, జనగామ మున్సిపాలిటీ దృష్టికి వచ్చిన సమాచారం మేరకు కొందరు వ్యక్తులు తాము మున్సిపాలిటీ అధికారులు లేదా సిబ్బందినని చెప్పుకుంటూ వ్యాపారులకు ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు తెలిపారు.
ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, బకాయిల చెల్లింపులు, జరిమానాల పేరుతో గూగుల్ పే, ఫోన్ పే, క్యూ ఆర్ కోడ్లు లేదా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నగదు పంపించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ఇలాంటి కాల్స్, సందేశాలు, లింకులు, క్యూ ఆర్ కోడ్లకు మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మున్సిపాలిటీ తరఫున ఎవరూ వ్యక్తిగత ఫోన్ నంబర్ల ద్వారా డబ్బులు చెల్లించాలని సూచించరని తెలిపారు. ట్రేడ్ లైసెన్స్‌కు సంబంధించిన చెల్లింపులు అధికారిక మున్సిపల్ పోర్టల్ లేదా మున్సిపల్ కార్యాలయం ద్వారా మాత్రమే నిర్వహిస్తామని పేర్కొన్నారు.
వ్యాపారులు, ప్రజలు ఇలాంటి మోసపూరిత కాల్స్, సందేశాలు, లింకులు, క్యూ ఆర్ కోడ్లను నమ్మవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే జనగామ మున్సిపాలిటీ కార్యాలయాన్ని సంప్రదించి ధృవీకరించుకోవాలని సూచించారు.
ఎవరైనా మోసానికి గురైనట్లయితే వెంటనే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వడంతో పాటు సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
