Heavy rains | దంచికొట్టిన వర్షం.. కల్లాల్లోనే మిగిలిన వరి..

Heavy rains | దంచికొట్టిన వర్షం.. కల్లాల్లోనే మిగిలిన వరి..

  • నీట మునిగిన రహదారులు
  • తడిసి ముద్దైన ధాన్యం కుప్పలు
  • రైతన్నల కళ్లలో నీళ్లు
  • నీట మునిగిన రహదారులు,

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: తెలంగాణలో పలు జిల్లాల్లో గురువారం వర్షాలు కురిశాయి. కామారెడ్డి, నిర్మల్ జిల్లాలతో పాటు వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే గత కొన్ని నెలలుగా మండుతున్న ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది.

అయితే ఈ వర్షం రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంతో పాటు పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యం కుప్పలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఇంకా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తికాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే తడిసిపోతుండటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం కుప్పలతో పాటు కాంటా చేసి బస్తాల్లో నింపిన ధాన్యం కూడా వర్షపు నీటిలో తడిసిపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోతున్నారు.

ఇప్పటికే ధాన్యం రైస్ మిల్లులకు తరలింపులో జాప్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అకాల వర్షం మరో గట్టి దెబ్బగా మారింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తున్న రైతులు, వెంటనే అధికారులు స్పందించి నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

చెరువులను తలపించేలా రహదారులు..

దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంతో పాటు బాన్సువాడ ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. కొద్ది నిమిషాల్లోనే వాతావరణం పూర్తిగా మారిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కామారెడ్డి పట్టణంలో గంటపాటు కురిసిన భారీ వర్షం రహదారులను చెరువులను తలపించేలా మార్చింది. నిజాంసాగర్ చౌరస్తా, లయోలా స్కూల్ జంక్షన్, పాత బస్టాండ్, సిరిసిల్ల రోడ్, విద్యానగర్ కాలనీ, బతుకమ్మ కుంట, పంచముఖి హనుమాన్ కాలనీ ప్రాంతాల్లో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. పలుచోట్ల వాహనాలు నిలిచిపోగా, కొన్ని వాహనాలు నీటిలో మునిగిపోయాయి.

Leave a Reply