ఆగస్టు నెలాఖరుకే వైద్య కళాశాల భవనం పూర్తి
- హాస్టల్ పనులు సెప్టెంబర్ చివరి నాటికి పూర్తిచేయాలి
- అధికారులకు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశం
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో అప్పగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఆర్ అండ్ బీ, వైద్య కళాశాల, టీజీఎంఐడీసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. పనులను వేగవంతం చేస్తూనే నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
మిగిలిన పనులపై ప్రత్యేక దృష్టి సారించి, రోజువారీగా పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య కళాశాలకు అవసరమైన విద్యుత్, తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలను సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణ పనులను కూడా సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ రమేష్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, కేపీసీ ప్రత్యేక ఇంజినీర్ శివరామ్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

