రైతు బాంధవుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర..
జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా..
నర్సంపేట ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు

ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ ఉద్యమ కెరటం, కేసీఆర్ ప్రధాన అనుచరుడు, నర్సంపేట రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన రైతు బాంధవుడు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన ముద్ర వేసి అందరి మన్ననలు పొందిన ఉద్యమ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు. ఈ వార్తను నర్సంపేట ప్రజలే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నెల 26న తీవ్రమైన గుండెపోటు రావడంతో వెంటనే హనుమకొండలోని రోహిణి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, మరో మాజీ మంత్రి హరీశ్ రావు దగ్గరుండి హైదరాబాద్‌కు తరలించారు. గత ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 12 గంటల 51 నిమిషాలకు కన్నుమూశారు. తమ అభిమాన నాయకుడు, ఉద్యమ సారథి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరనే విషయాన్ని నర్సంపేటతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు నమ్మలేకపోతున్నారు. పెద్ది అకాల మరణం వరంగల్ జిల్లాలో విషాదాన్ని నింపింది. ఆయన మృతికి ఉమ్మడి వరంగల్‌తో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా తమ నివాళులు అర్పిస్తున్నారు.

ఓరుగల్లు రాజకీయాల్లో చెరగని ముద్ర

కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలం నుంచి జడ్పీటీసీగా గెలుపొందిన పెద్ది సుదర్శన్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేత కేసీఆర్ వెంటే నడిచారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నాయకుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ది సుదర్శన్ రెడ్డి మొదటి వరుసలో నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ సాధన కోసం ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించిన భారీ బహిరంగ సభను వరంగల్‌లోని ప్రకాశ్‌రెడ్డిపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రధాన సభల బాధ్యతలను ఉద్యమ నేత కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డికే అప్పగించేవారు. ఏల్కతుర్తిలో జరిగిన టీఆర్ఎస్ భారీ సభ కూడా ఆయన నిర్వహణలోనే జరిగింది.

రైతు బాంధవుడిగా నర్సంపేట ప్రజల గుండెల్లో నిలిచిన పెద్ది

అధికారంలో ఉన్నామా లేదా అనేది కాదు… ప్రజలకు ఏమి చేశామనేదే ముఖ్యం అనే భావనతో పనిచేసిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. 2014లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సహకారంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి, పాకాల సరస్సును నింపి నర్సంపేట ప్రజల గుండెల్లో రైతు బాంధవుడిగా చిరస్మరణీయమైన ముద్ర వేశారు. మాదన్నపేట వాగుపై సిద్ధాం నిర్మించి, నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా కృషి చేశారు. రైతు బాంధవుడిగా సుదర్శన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి మనసులో చెరగని ముద్ర వేశారు.