గంజాయి వినియోగదారులపై ఉక్కుపాదం
120 మందికి యూరిన్ టెస్టులు..
17 మందికి పాజిటివ్
పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు
– ఎస్పీ వకుల్ జిందాల్
ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: గంజాయి వినియోగం, విక్రయాల నియంత్రణకు గుంటూరు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, గంజాయి కేసుల్లో నిందితులపై సోమవారం ఎన్డీపీఎస్ చట్టం కింద యూరిన్ టెస్టులు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ కొత్తపేట, లాలాపేట, పాతగుంటూరు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉన్న 120 మంది నేరస్తులకు యూరిన్ పరీక్షలు నిర్వహించగా 17 మందికి గంజాయి వినియోగించినట్లు పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని వారు ఎక్కడి నుంచి మత్తు పదార్థాలు సేకరించారనే అంశంపై దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు గంజాయి వినియోగిస్తూ పట్టుబడిన 400 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పలుమార్లు గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడిన 10 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు.
గంజాయి నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు 230 “సంకల్ప్” అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గంజాయి సేవించడం, విక్రయించడం వల్ల వ్యక్తిగతంగా, కుటుంబపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు.
ఈరోజు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారందరిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తారని తెలిపారు.
