చీరాల‌కు తిరిగిచ్చేస్తున్నారు..

  • చీరాల నియోజకవర్గ ప్ర‌జ‌ల రుణం తీర్చుకుంటున్న ఎమ్మెల్యే ఎంఎం కొండ‌య్య‌
  • 2024 ఎన్నికల్లో 20వేల ఓట్ల మెజారిటీతో శాసనసభ్యుడిగా గెలుపు
  • రెండేళ్లలోనే నియోజకవర్గంలో రూ.500 కోట్ల అభివృద్ధి పనులు
  • రూ. 750 కోట్ల సంక్షేమ ఫలాల ప్రజలకు చేరువ
  • సామాన్యుల స‌గ‌టు అవ‌స‌రాలు గుర్తించిన కార్మికుడు
  • మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నే అజెండాగా ముందుకు
  • రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమంతో చీరాల ప‌రుగులు
  • ప్ర‌జ‌ల ద‌ప్పిక తీరుస్తూ..తాగునీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం
  • ర‌వాణా, విద్య‌, వైద్య స‌దుపాయాల‌పై ప్ర‌త్యేక కృషి
  • తండ్రి బాటలోనే తనయుడు మహేంద్ర నాథ్
  • నియోజ‌క‌వ‌ర్గంలో త‌న మార్క్ పాల‌న చూపిస్తున్న ప్ర‌జా నాయ‌కుడు
  • ఇర‌వై ఏళ్ల‌లో ఎవ‌రూ చేయ‌ని..మ‌రో ఇర‌వై ఏళ్లు గుర్తు పెట్టుకునేలా..
  • ఇంటింటికి టీడీపీ కార్య‌క్ర‌మంలో ఉత్సాహంగా ముందుకు..
  • కూట‌మి విజ‌యాల‌ను వివ‌రిస్తూ.. ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్న ఎమ్మెల్యే

ఒక ఊరి సర్పంచ్‌గా మొదలైన ఆ ప్రస్థానం.. నేడు చీరాల చరిత్రనే తిరగరాసే నవశకానికి నాంది పలికింది. మాస్ లీడర్‌కి ఉండాల్సిన మాస్ విజన్.. ప్రజల కష్టాలను క్షణాల్లో అర్ధం చేసుకునే క్లాస్ ఆలోచన కలబోస్తే వచ్చే లీడర్‌షిప్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు చీరాల ఎమ్మెల్యే మద్దూలూరి మాలకొండయ్య. మాటల మరాఠీలు చాలామందిని చూసిన చీరాల నేల మనసున్న నాయకుడి రాకతో అభివృద్ధి సిందూరం దిద్దుకుంది. గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎన్ని అడుగులైనా ముందుకు వేస్తానని, ప్రజల గుండె గడపలో సంక్షేమ తోరణం కడతానని దీక్షబూనారు. మాలకొండయ్య నడకలో నిజాయితీ, మాటల్లో సూటిదనం, చేతల్లో చురుకుదనం నేడు చీరాల ప్రజల జీవితాలను తీర్చిదిద్దే వెలుగు రేఖలయ్యాయి. ఆర్బాటాలు లేని స్వచ్ఛమైన రాజకీయం, అపరిమితమైన అభివృద్ధి, సంక్షేమం చీరాల గడ్డపై చిరకాల నిలిచిపోయే రాజకీయ ఉద్దండుని అందించాయి. కేవలం రెండేళ్లలోనే మంచి చేయాలనే తపన, గతిని మార్చాలనే దృక్పథం ఏకంగా రూ.1,250 కోట్ల భారీ నిధులతో చీరాల నియోజకవర్గాన్ని ఒక ప్రగతికి చిరునామా మార్చాయి.. గత ఇరవై ఏళ్లలో చీరాల నడిబొడ్డన ఎరుగని సరికొత్త రాజకీయ చతురతను ఆవిష్కరించిన మాలకొండయ్య మరో 20 ఏళ్లకు తిరుగులేని పునాదులు వేసుకున్నారు.

ఆంధ్రప్రభ బ్యూరో బాపట్ల : మద్దూలూరి మాల‌కొండ‌య్య. ఈ పేరును చీరాల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు మ‌రో ఇర‌వై ఏళ్లు గుర్తు పెట్టుకుంటారు. రెండేళ్లు ఎమ్మెల్యేగా అభివృద్ధిలో ఆయ‌న చూపిన ప్ర‌భావం అలాంటిది. గ‌త పాల‌కులకు విభిన్న రీతిలో ఆయ‌న ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని సామాన్య ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో.. వారి క‌నీస అవ‌స‌రాలు ఏంటో.. ఆయ‌న ఎన్నిక‌ల ముందే గ్ర‌హించారు.

వాటిని అజెండాగా తీసుకుని ముందుకు సాగారు. పెద్ద‌గా ఆర్భాటాలు చేయ‌లేదు. ప్ర‌జ‌ల త‌న ద‌గ్గ‌ర‌కొచ్చి చెప్పుకున్న గుక్కెడు మంచినీరు, ఓ మంచి రోడ్డు, క‌నీస వైద్య స‌దుపాయాలు, కార్మికుల‌కు అవ‌స‌ర‌మైన ర‌వాణా సౌక‌ర్యాలపై దృష్టి సారించారు. ఇలా క‌నీస మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తూ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌న‌లు పొందుతున్నారు. దీనికి తోడు కూట‌మి ప్ర‌భుత్వం చేప‌డుతున్న సూప‌ర్ సిక్స్ సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఆయ‌న‌కు మ‌రింత క‌లిసొస్తున్నాయి.

పార్టీ అధిష్ఠానం చేప‌ట్టిన ఇంటింటికీ టీడీపీ కార్య‌క్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రెండేళ్ల పాల‌న‌లో రాష్ట్రానికి కూట‌మి ప్ర‌భుత్వం చేసిన మేలు.. చీరాల నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి త‌ను చేస్తున్న కృషిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.

చీరాల ప్ర‌జ‌ల దాహార్తి తీరుస్తూ..

ఒక గ్రామ స‌ర్పంచ్‌గా త‌న రాజ‌కీయ జీవితం మొద‌లు పెట్టిన ఎమ్మెల్యే మ‌ద్దులూరి మాల‌కొండ‌య్య‌కు క్షేత్ర‌స్థాయి ప్ర‌జ‌ల అవ‌స‌రాలు, క‌ష్టాలు బాగా తెలుసు. త‌ను తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిగా పోటీలో నిల‌బ‌డిన నాటి నుంచే చీరాల ప్రాంత ప్ర‌ధాన తాగునీటి స‌మ‌స్య‌ను ఆయ‌న గుర్తించారు. స్థానికులు కూడా ఇదే విష‌యాన్ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో అధికారంలోకి రాగానే ఇంటింటికీ కొళాయి ద్వారా తాగునీరు అందించే జ‌ల‌జీవ‌న్ మిష‌న్ ప‌నులను ప‌రుగులు పెట్టించారు. ఇప్ప‌టికే ఈ ప‌థ‌కం కింద రూ.10.76కోట్ల‌తో పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణ ప‌నులు పూర్తయ్యాయి. మ‌రో రూ.28 కోట్ల ప‌నులు టెండ‌ర్ల ద‌శ‌లో ఉన్నాయి. ఇవి కూడా పూర్త‌యితే.. ఇక చీరాల‌కు తాగునీటి స‌మ‌స్య అన్న‌దే ద‌రిదాపుల్లో ఉండ‌దు.

రోడ్ల‌కు మ‌హ‌ర్ద‌శ‌..

ఎమ్మెల్యేగా త‌న రెండేళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంలో మాల‌కొండ‌య్య చీరాల‌ను అభివృద్ధి మార్గంలో ప‌రుగులు పెట్టిస్తున్నారు. రోడ్ల విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నారు. మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం కింద నియోజ‌క‌వ‌ర్గంలో రూ.9.65 కోట్ల‌తో సీసీ రోడ్ల‌ను వేయించారు. రూ.3.50 కోట్ల‌తో జాండ్ర‌పేట నుంచి వేట‌పాలెం వ‌ర‌కు ఆర్ అండ్‌బీ రోడ్డును వేగంగా పూర్తి చేయించారు. మ‌రో రూ.2.75 కోట్ల‌తో ఆర్ అండ్ బీ రోడ్ల‌ను అభివృద్ధి చేశారు.

ఇక మ‌రో రూ.10కోట్ల‌తో గ్రామాల్లో లింకు రోడ్లు పూర్తి చేశారు. రామాపురం నుంచి అబ్దుల్ క‌లాం కాల‌నీ వ‌ర‌కు బీటీ రోడ్డుకు రూ.1.15 కోట్లు,పాపాయి పాలెం నుంచి బీచ్ వ‌ర‌కు రూ.1.80కోట్లు, బోయినవారిపాలెం నుంచి కుంకుల మ‌ర్రు వ‌ర‌కు రూ.కోటి రూపాయ‌లు, వాడ‌రేవు నుంచి పొట్టి సుబ్బ‌య్య‌పాలెం బీటీ రోడ్డుకు రూ.8కోట్ల గ్రాంట్లు తీసుకొచ్చి.. చీరాల‌ను అభివృద్ధి మార్గంలో ప‌య‌నించేలా చేస్తున్నారు.

అభివృద్ధిలో ప‌రుగులు..

అభివృద్ధి విష‌యంలో చీరాల ఎమ్మెల్యే మాల‌కొండ‌య్య త‌న మార్కు పాల‌న చూపిస్తున్న చీరాలోని వీర‌రాఘ‌వ స్వామి ఆల‌య పునః నిర్మాణానికి రూ.73ల‌క్ష‌లు, రూ.2కోట్ల‌తో చీరాల‌లో ఫైర్ స్టేష‌న్ భ‌వవ నిర్మాణం, చ‌ల్లారెడ్డిపాలెంలోని కొణిజేటి చేనేత‌పురిలో రూ.4.77కోట్ల‌తో ఎంఎస్ఎంఈ పార్క్‌, ప‌ట్ట‌ణాల్లో రూ.4.90కోట్ల‌తో పేద‌ల‌కు గృహ నిర్మాణాలు, రామాపురం, వాడ‌రేవుల్లో రూ.60 ల‌క్ష‌ల‌తో ప్ర‌జా మ‌రుగుదొడ్ల నిర్మాణం, చీరాల‌లో రూ.4.11 కోట్ల‌తో నూత‌న విద్యుత్ భ‌వ‌నాలు మంజూరు, నిరంత‌రాయ విద్యుత్ కోసం నూత‌న ట్రాన్స్‌ఫార్మ‌ర్ల ఏర్పాటు, రూ.50ల‌క్ష‌ల‌తో రామ‌న్న పేట‌లో హెల్త్ యూనిట్ నిర్మాణం, రూ.4.77కోట్ల‌తో వెదుళ్ల‌ప‌ల్లి – వాడ‌రేవు హైలెవ్ బ్రిడ్జి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసి పంపించారు. రూ.13కోట్ల‌తో స్వ‌ర్ణ గ్రామ‌, వార్డు కార్యాల‌యాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. గోకులం షెడ్ల నిర్మాణం.. ఇలా చెప్పుకుంటూ.. పోతే.. ఈ రెండేళ్ల‌లోనే లెక్క పెట్టుకోలేన‌న్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఎమ్మెల్యే కొండ‌య్య చేప‌ట్టారు.

సంక్షేమ సార‌థి.. చీరాల ప్ర‌జాప్ర‌తినిధి..

ఎమ్మెల్యే మాల‌కొండ‌య్య సంక్షేమ సార‌థిగా నిలిచారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు రూ.750కోట్ల సంక్షేమ ఫ‌లాలను ప్ర‌జ‌ల‌కు అందించారు. పింఛ‌న్ల పెంపు, సూప‌ర్ సిక్స్ అమ‌లులో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చారు. స్త్రీ శ‌క్తి ప‌థ‌కంతో ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఇక్క‌డ అత్యంత విజ‌య‌వంత‌మైన ప‌థ‌కంగా చెప్పుకోచ్చు. ఇత‌ర ప్రాంతాల‌కు ఇక్క‌డి నుంచి ప‌నుల కోసం వెళ్లే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం తోడ్పాడునిచ్చింది.

మ‌హిళ ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. ముఖ్యంగా మ‌త్స్య‌కారులు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో మ‌త్స్య‌కార భ‌రోసా వారి అక్క‌ర‌కు వ‌చ్చింది. వేట వివ‌రామ స‌మ‌యంలో పెంచిన భృతి గంగ‌పుత్రుల‌కు భ‌రోసా ఇచ్చింది. ఇక ఏడాదికి మూడు ఉచిత సిలిండ‌ర్లు, అన్న‌దాత సుఖీభ‌వ‌, త‌ల్లికి వంద‌నం వంద‌నంతో రూ.వంద‌ల కోట్ల సంక్షేమ ఫ‌లాల‌ను నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు చేర్చి వారి క‌ళ్ల‌ల్లో ఆనందాన్ని నింపారు.

ఆరోగ్య రంగంలో మార్పులు.. పనితీరే రాజకీయ బలంగా మారుతోందా?

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తూ చీరాల ఎమ్మెల్యే మద్దూలూరి మాలకొండయ్య ముందుకు సాగుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సేవల విస్తరణ అంశాలు ఆయన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని అనుచరులు పేర్కొంటున్నారు.

ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చీరాల అభివృద్ధిలో వేగం పెరిగిందనే ప్రచారంతో ఎమ్మెల్యే వర్గాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. 100 పడకల సామర్థ్యం ఉన్న ఏరియా ఆసుపత్రిలో అదనపు పడకల నిర్వహణ, పెరిగిన ఓపీ సేవలు, రికార్డు స్థాయిలో ల్యాబ్‌ పరీక్షలు వంటి అంశాలను ప్రభుత్వం చేపట్టిన మార్పులకు ఉదాహరణగా చూపిస్తున్నారు.

చీరాల ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా రూ.23. 75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్‌ (CCB), మొత్తం రూ.37 కోట్ల నిధుల మంజూరు వంటి అంశాలను ఎమ్మెల్యే తన అభివృద్ధి అజెండాలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. హైవే ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడేందుకు చేపడుతున్న చర్యలు ప్రజల్లో సానుకూల స్పందన తెస్తున్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. STEMI ప్రాజెక్ట్‌ ద్వారా గుండెపోటు బాధితులకు ఉచితంగా క్లాట్‌ బస్టర్‌ ఇంజెక్షన్లు అందించి 42 మంది ప్రాణాలను కాపాడిన అంశాన్ని కూడా ఎమ్మెల్యే వర్గాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.

తండ్రికి తగ్గ తనయుడిగా మహేంద్రనాథ్‌.. చీరాల రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు

చీరాల రాజకీయాల్లో యువ నాయకుడిగా మహేంద్రనాథ్‌ తనదైన ముద్ర వేస్తున్నారు. ఎమ్మెల్యే మద్దూలూరి మాలకొండయ్య వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన, తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలతో మమేకమవుతున్నారు.

అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగుతున్న మహేంద్రనాథ్‌.. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. యువతతో పాటు వివిధ వర్గాల ప్రజల్లోనూ ఆయనకు ఆదరణ పెరుగుతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తండ్రి మాలకొండయ్యకు ఉన్న ప్రజా సంబంధాలను కొనసాగిస్తూ, తనదైన శైలిలో నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్న మహేంద్రనాథ్‌ చీరాల రాజకీయాల్లో భవిష్యత్‌ నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారని అనుచరులు చెబుతున్నారు.

అసెంబ్లీలో చేనేతల కష్టాలు…

చేనేతలకు పుట్టినిల్లు అయిన చీరాలలో నేత కార్మికుల కష్టాలను ఎమ్మెల్యే మాలకొండయ్య పలు వేదికల పై ప్రస్తావించారు వారి కష్టాలను తీర్చేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు చేనేత సూరీడు, ప్రజా బంధు పరకట కోటయ్య కృషిని అసెంబ్లీలో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమాలను జులై 26న కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. అలాగే నేతన్న భరోసా పేరుతో ఏడాదికి రూ. 25 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తూ… ఇటీవల క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది చేనేత దినోత్సవం రోజున ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కొండయ్య చీరాలలో ఘన నివాళులర్పించారు.