సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలి..!
సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలి..!
- మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : కాలేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తూ బీఆర్‌ఎస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, రైతులకు నీరు అందకుండా పరిస్థితులు సృష్టించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు.
గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి, కాలేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అంశాలపై స్పందించారు. కాలేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిపోవడాన్ని ఆధారంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులా మారిందని వ్యాఖ్యానించారు.
గోదావరి జలాలతో సాగునీరు అందించే కాలేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను తగ్గించేలా ప్రభుత్వం వ్యవహరించిందని, రైతులకు నీరు అందకుండా అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి అర్థం చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డికి రెండున్నరేళ్లు పట్టిందని జోగు రామన్న వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు పిల్లర్ల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని ఆరోపించారు.
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నివేదిక ఇచ్చారని విమర్శించారు. రైతు భరోసా అమలు చేయకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని అన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ఘటనపై చర్యలు తీసుకోవాలి:
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి కనిపించడం లేదని విమర్శిస్తూ, టీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు నీరు అందించామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కేఎం శ్రీకాంత్, అజయ్, కేదరేశ్వర్ రెడ్డి, మొటై కిరణ్ కుమార్, రాథోడ్ సజన్, దాసరి రమేష్, ప్రకాష్, అభిరామ్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
