మారుగూడలో గంజాయి సాగు వెలుగులోకి..
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : ముందస్తు సమాచారం మేరకు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని మారుగూడ గ్రామ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వ్యవసాయ భూమిలో కోవా అర్జున్ అనే వ్యక్తి గంజాయి మొక్కలను అంతర్ పంటగా సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో, ఉన్నతాధికారుల సూచన మేరకు పోలీసులు వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి దాడి నిర్వహించారు.
ఈ సందర్భంగా పంట చేనులో సుమారు 2 నుంచి 3 అడుగుల ఎత్తు గల 8 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సిర్పూర్ (యు) ఎస్సై రామకృష్ణ తెలిపారు. పోలీస్ బృందం సంఘటన స్థలానికి చేరుకున్నప్పుడు అనుమానాస్పదంగా ప్రవర్తించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను మారుగూడ గ్రామానికి చెందిన కోవా అర్జున్ (37)గా గుర్తించినట్లు తెలిపారు.
విచారణలో తన వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కలను సాగు చేసినట్లు అర్జున్ ఒప్పుకున్నాడని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ సుమారు రూ.80,000గా అంచనా వేశారు.
ఈ మొక్కలను పంచుల సమక్షంలో సీజ్ చేసి కేసు వస్తువుగా (ఎం.ఓ-1) నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
