మహర్షి భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణకు పెద్దపీట..

మహర్షి భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణకు పెద్దపీట..
కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : గంగను భూమ్మీదకు తెచ్చిన మహనీయులు మహర్షి భగీరథను స్మరించుకుంటూ సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ జల సంరక్షణలో కీలక భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. మహర్షి భగీరథ జయంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి భగీరథుని చిత్రపటానికి పూల మాలలు వేసి మహనీయుని స్ఫూర్తి పథాన్ని స్మరించుకున్నారు.

భగీరథుని పట్టుదల స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గాన్ని, అనుసరించాల్సిన అవసరాన్ని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా జలధార-జలహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని.. 100 రోజుల కార్యాచరణతో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
నీటి వనరులను సంరక్షించడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను కాపాడుకోవడం వంటి అంశాల్లో ప్రజలందరూ చైతన్యంతో ముందుకు రావాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇ.జగ్గయ్య, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
