నౌకాదళం యుద్దనౌకకు మచిలీపట్నం నామకరణం..
పెడన, (ఆంధ్రప్రభ): సముద్ర వాణిజ్య వారసత్వానికి ప్రతీకగా నిలిచిన మచిలీపట్నం పేరును భారత నౌకాదళం అత్యాధునిక యుద్ధ నౌకకు నామకరణం చేయడం చరిత్రాత్మక నిర్ణయమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
మచిలీపట్నం పేరుతో నిర్మించిన ఈ యుద్ధ నౌక ప్రతి కృష్ణా జిల్లా వాసికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. భారత నౌకాదళం కోసం నిర్మించిన ‘మచిలీపట్నం‘ సబ్మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రారంభం దేశ తీర భద్రతను మరింత బలోపేతం చేసే కీలక ఘట్టమని ప్రశంసించారు.
ఎనభై శాతానికి పైగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ యుద్ధ నౌక, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భారత రక్షణ రంగం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనమని బూరగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు.
మచిలీపట్నం పేరును జాతీయ స్థాయిలో మరింత గౌరవప్రదంగా నిలబెట్టిన భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖ, అలాగే ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
