కర్నూలు విమానాశ్రయ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష
భూసేకరణ, భద్రత, మౌలిక వసతులపై అధికారులతో డీఆర్వో వెంకటనారాయణమ్మ చర్చ
కర్నూలు, ఆంధ్రప్రభ : ఓర్వకల్లు కర్నూలు విమానాశ్రయ అభివృద్ధి, భద్రతా ప్రమాణాల మెరుగుదల, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎయిర్‌ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) వెంకటనారాయణమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విమానాశ్రయ అధికారులు పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక వాహనాలు వేగంగా చేరుకునేందుకు క్రాష్ గేట్–10 వద్ద అదనంగా మూడు ఎకరాల భూమి అవసరమని అధికారులు వివరించారు. అలాగే భవిష్యత్తు విస్తరణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 38.5 ఎకరాల భూమి సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) నిబంధనల మేరకు వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించినప్పటికీ, భూమి బదిలీ ప్రక్రియ పూర్తికాలేదని అధికారులు తెలిపారు. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని డీఆర్వోను కోరారు.
విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న బ్లాస్టింగ్ పనుల కారణంగా దుమ్ము, ధూళి అధికంగా ఎగసిపడుతూ విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని అధికారులు వివరించారు. పరిసర ప్రాంతాల్లో పెరిగిన పొదలు, పిచ్చిమొక్కలను తొలగించి పరిశుభ్ర వాతావరణం కల్పించాలని సూచించారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ నిబంధనల ప్రకారం విమానాశ్రయ పరిసరాల్లో ఎత్తైన చెట్లు పెంచడం, అనుమతులు లేకుండా ఎత్తైన భవనాలు నిర్మించడం నిషేధమని అధికారులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలపై సంబంధిత శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
ప్రయాణికులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌ను కేటాయించాలని, ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించేందుకు జిల్లా అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ టెండర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విమానాశ్రయ అధికారులు విజ్ఞప్తి చేశారు.
విమానాశ్రయ అధికారులు ప్రస్తావించిన అన్ని అంశాలపై డీఆర్వో వెంకటనారాయణమ్మ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సమావేశంలో కర్నూలు విమానాశ్రయ డైరెక్టర్ విద్యాసాగర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, విమానాశ్రయ ప్రతినిధులు పాల్గొన్నారు.
