కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి…
కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి…
విద్యా పర్యవేక్షణ కమిషన్ (APSERMC) ను తక్షణమే పునరుద్ధరించాలి…
ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) డిమాండ్…
ముఖ్యమంత్రి కి తలిదండ్రులు లేఖ.
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సాగిస్తున్న అక్రమ ఫీజుల వసూళ్లపై ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు లేఖ పంపింది.
ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శిఖరం నరహరి, కార్యదర్శి ఈశ్వరయ్య, గౌరవ అధ్యక్షుడు కోటారెడ్డి, ఉపాధ్యక్షులు జయప్రకాష్, భాస్కర్, బాబు, శ్రీనివాసుల రెడ్డి, జగన్నాథం, దాసరి సురేష్, రాజశేఖర్ యాదవ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యాసంస్థల నిరంకుశ ఫీజుల విధానానికి ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌కేజీ (LKG) నుంచి జూనియర్ ఇంటర్మీడియట్ వరకు ఫీజులను నియంత్రించేందుకు, విద్యా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APSERMC) ప్రస్తుతం పూర్తిస్థాయి చైర్మన్, సభ్యులు లేక నిష్క్రియాత్మకంగా మారిందని విమర్శించారు.
కమిషన్ నిర్వీర్యంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, కోర్టు తీర్పులలోని సాంకేతిక అంశాలను సాకుగా చూపుతూ కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల ప్రధాన డిమాండ్లు
ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాలను రక్షించాలని కోరారు. డిమాండ్లపై స్పందన లేకపోతే తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
