రోడ్డుపై పశువుల సంచారం.. ప్రమాదాలకు ఆహ్వానం
- ములుగు–ఘనపూర్ ఎక్స్‌రోడ్‌పై వాహనదారులకు ముప్పు
- చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
గణపురం, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని ములుగు–ఘనపూర్ ఎక్స్‌రోడ్ ప్రధాన రహదారిపై రాత్రి వేళల్లో పశువులు గుంపులుగా సంచరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేగంగా వచ్చే వాహనాలకు పశువులు అకస్మాత్తుగా ఎదురుగా రావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ రహదారిపై రాత్రివేళల్లో భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. చీకటిలో రోడ్డుపై పడుకుని ఉండే లేదా సంచరించే పశువులు కనిపించకపోవడంతో వాహనదారులు ఒక్కసారిగా బ్రేకులు వేయాల్సి వస్తోంది. దీంతో ప్రమాదాలు తప్పుతున్నా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రమాదాలు జరిగినప్పటికీ, రోడ్డుపై పశువుల సంచారాన్ని అరికట్టేందుకు సంబంధిత అధికారులు సమర్థవంతమైన చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాత్రి వేళల్లో పశువులు రహదారిపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
