బసవేశ్వరుల ఆలోచనలు ఆచరణలో పెట్టాలి

బసవేశ్వరుల ఆలోచనలు ఆచరణలో పెట్టాలి

  • సౌభ్రాతృత్వం, సమానత్వం కోసం బసవేశ్వరుల బోధనలు
  • కలెక్టరేట్‌లో బసవేశ్వరుల 893వ జయంతి వేడుకలు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; బసవేశ్వరుల ఆలోచనలను ఆచరణలో అమలు చేసి సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను కాపాడాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన మహాత్మా బసవేశ్వరుల 893వ జయంతి వేడుకల సందర్భంగా, ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల అర్పించి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మహాత్మా బసవేశ్వరుల 893వ జయంతి వేడుకులు జరుపుకుంటున్నామన్నారు. బసవన్నగా ప్రసిద్ధి చెందిన బసవేశ్వరులు 12వ శతాబ్దానికి చెందిన మహనీయ సామాజిక సంస్కర్త, తాత్వికుడు, సమానత్వ వాదిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జన్మించిన బసవేశ్వరులు కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ, స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రోత్సహించారని కలెక్టర్ తెలిపారు.

సమాజంలో సమాన హక్కులు, న్యాయం, ధర్మం స్థాపన కోసం ఆయన చేసిన కృషి అపారమైందన్నారు. తన సాహిత్య కవిత్వం ద్వారా సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా ఉన్నతమైన ఆలోచనలను వ్యాప్తి చేశారని ఆమె తెలిపారు. బసవేశ్వరులు స్థాపించిన లింగాయత సంప్రదాయం నేటికీ విశేషంగా అనుసరించబడుతోందన్నారు. కర్ణాటకలోని బీజాపూర్ ప్రాంతం నుంచి భక్తులు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని కలెక్టర్ తెలిపారు. 

తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించిన పాల్కురికి సోమనాథుడు, బసవేశ్వరుల చరిత్రను “బసవ పురాణం” ద్వారా ప్రజల్లో విస్తృతంగా పరిచయం చేశారన్నారు. ద్విపద ఛందస్సులో రచనలు చేసిన ఈయన ప్రజాకవిగా పేరుపొందారన్నారు. అదేవిధంగా “మల్లికార్జున పండితారాధ్య చరిత్ర” వంటి గ్రంథాలను రచించి ఆధ్యాత్మిక, సాహిత్య రంగాలకు సేవలందించారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, జిల్లా టూరిజం అధికారి కె విజయలక్ష్మి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply