ఒంటరిగా బస్టాండ్లో బాలిక..
- గుర్తించిన కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
నాయుడుపేట, ఆంధ్రప్రభ : అనుమానాస్పద పరిస్థితుల్లో ఒంటరిగా కనిపించిన ఓ మైనర్ బాలికను నాయుడుపేట పోలీసులు సకాలంలో గుర్తించి సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నాయుడుపేట బస్టాండ్లో నైట్ ఎన్ఆర్ఓ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ ఒంటరిగా సంచరిస్తున్న సుమారు 15 ఏళ్ల బాలికను గుర్తించి విచారించారు.
విచారణలో ఆమె ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసి ప్రస్తుతం అమ్మమ్మ వద్ద ఉంటూ కూలీ పనులు చేస్తున్నట్లు తెలిపింది. శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తి పిలుపు మేరకు అక్కడికి వెళ్లేందుకు బయలుదేరినట్లు, అయితే తాను ప్రయాణిస్తున్న బస్సు శ్రీకాళహస్తి పట్టణంలోకి వెళ్లకుండా బైపాస్ మార్గంలో వెళ్తుందని తెలుసుకుని నాయుడుపేట బస్టాండ్లో దిగినట్లు వివరించింది.
బాలిక పరిస్థితి అనుమానాస్పదంగా ఉండటంతో ఆమెను నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు, డీఎస్పీ ఆదేశాల మేరకు బాలిక తల్లికి సమాచారం అందించారు. అనంతరం తల్లి సమక్షంలో బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి, అపరిచితులను నమ్మడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
అనంతరం బాలికను సురక్షితంగా తల్లి సంరక్షణకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాడ్లాడుతూ.. సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల ద్వారా పరిచయమయ్యే అపరిచితులను నమ్మి మైనర్లు ఇంటి నుంచి వెళ్లకుండా అవగాహన కల్పించాలని కోరారు. అనుమానాస్పద పరిస్థితుల్లో బాలలు కనిపిస్తే వెంటనే డయల్-112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
