సమస్యలపైనే ఫోకస్
క్షేత్రస్థాయిలో పర్యటిస్తా.. సమస్యలను పరిష్కరిస్తా
గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ తమీమ్ అన్సారియా
గుంటూరు, ఆంధ్రప్రభ: గుంటూరు జిల్లా (Guntur District)లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ (Collector)గా బాధ్యతలు స్వీకరించిన ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. కలెక్టర్ల బదిలీలో భాగంగా ఆమె ప్రకాశం జిల్లా ( Prakasam District) నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. జిల్లా కలెక్టరేట్‌లో నూతన కలెక్టర్‌కు జిల్లా రెవిన్యూ అధికారి ఖాజావలి స్వాగతం పలికారు. అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా ప్రజా ఫిర్యాదుల వేదికకు వస్తున్న బాధితుల సమస్యలను తీర్చేందుకు తాను ప్రత్యేక కార్యక్రమము నిర్వహిస్తానని వెల్లడించారు. వ్యవసాయ అధికారుల (Agricultural Officers)తో సమీక్షించి యూరియా (Urea) కొరత లేకుండా రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమస్యలతో వచ్చే ప్రతి బాధితునికి అండగా ఉంటానని ప్రభుత్వపరంగా వారికి అవసరమైన సహాయ సహకారం అందిస్తానని కలెక్టర్ అన్సారియా చెప్పారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధిని ముందంజలో నడిపిస్తానని చెప్పారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి సారించి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
