సంగంబండ రిజర్వాయర్ నుంచి చెరువులను పూర్తిగా నింపాలి

రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలను సంగంబండ రిజర్వాయర్ నుంచి తక్షణమే నింపి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు డిమాండ్ చేశారు.

సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణానది నుంచి భూత్‌పూర్, సంగంబండ రిజర్వాయర్లకు వస్తున్న నీటిని మక్తల్ మండలంతో పాటు రుద్రసముద్రం, గోలపల్లి, కాట్రేవుపల్లి, దండు, మంథన్‌గోడ్, మగనూరు, నర్వ మండలాల చెరువులకు కాలువల ద్వారా విడుదల చేయాలని కోరారు.

ప్రస్తుతం కృష్ణానదిలో నీటి ప్రవాహం సమృద్ధిగా ఉన్నప్పటికీ, రిజర్వాయర్ల నుంచి చెరువులకు నీటిని విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే నీటి పంపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి అన్ని చెరువులను నింపాలని డిమాండ్ చేశారు.

అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే మక్తల్‌లో భారీ రైతు ధర్నా నిర్వహించాల్సి వస్తుందని వెంకట్రాములు హెచ్చరించారు.