ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రోత్సాహం..
లబ్ధిదారులకు గోడ గడియారాల పంపిణీ
ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని గ్రామ నాయకుల పిలుపు
జుక్కల్, ఆంధ్రప్రభ: ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేసి, లబ్ధిదారులను ప్రోత్సహించేందుకు బస్వపూర్ గ్రామంలో గోడ గడియారాలను పంపిణీ చేశారు. సోమవారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గోడ గడియారాలను బహుకరించారు.
ఈ సందర్భంగా బస్వపూర్ ఉపసర్పంచ్ బొర్కార్ అనిల్, సర్పంచ్ భర్త సురేష్ గొండ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ గృహాలను మంజూరు చేస్తోందన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని పూరిగుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని, లబ్ధిదారులు గృహాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భరద్వాజ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
