ఉత్సవాల నాటికి అన్ని పనులు పూర్తి చేయాలి

  • అధికారులకు ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలు
  • శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
  • భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశాలు
  • అభివృద్ధి పనులు, లడ్డూ ప్రసాదం తయారీ ఏర్పాట్లపై క్షేత్రస్థాయి తనిఖీ

పాకాల, ఆంధ్రప్రభ: పాకాల మండలం ఊట్లవారిపల్లి గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 78వ ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పురోగతిని ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలు ప్రారంభమయ్యే లోపు అన్ని పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని ఆలయ చైర్మన్, ఈవో, కమిటీ సభ్యులు, నాయకులకు ఆదేశించారు.

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, క్యూలైన్లు, ఇతర మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

అనంతరం ఆలయంలో భక్తులకు అందించనున్న లడ్డూ ప్రసాదం తయారీ ఏర్పాట్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ప్రసాదం తయారీలో నాణ్యత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ఈవో, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.