ఘనంగా బొడ్రాయి పునఃప్రతిష్ఠ మహోత్సవం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. డప్పు మేళతాళాలు, మహిళల మంగళహారతుల నడుమ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పురోహితులు హరి సర్వోత్తమాచారి, సందీప్ చారి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు, కలశారాధన, పుణ్యాహవాచనం, ప్రాణ ప్రతిష్ఠ తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రేణుక భరత్, ఉమ్మడి జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ నింగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్, ఉప సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ గ్రామానికి రక్షణ చిహ్నంగా భావించే బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన జరగడం శుభపరిణామమని అన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో ఐక్యత, సామరస్యం, శాంతి, సౌభాగ్యాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
యువత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ దేవాలయాల అభివృద్ధికి తోడ్పడాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేడుకల సందర్భంగా దేవాలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, భక్తుల రద్దీతో పాతపేట ప్రాంతం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో పాతపేట, కుర్వగేరి గ్రామాల భక్తులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
