ధాన్యం విక్రయంలో రైతుల కష్టాలు

ధాన్యం విక్రయంలో రైతుల కష్టాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రైతులకు ధాన్యం పండించడం ఒక ఎత్తయితే, వాటిని విక్రయించడం మరో ఎత్తుగా మారుతోంది. చేతికొచ్చిన పంటను సకాలంలో కాంటా వేయించి రైస్ మిల్లులకు తరలించి అన్‌లోడ్ చేయించేందుకు తీవ్ర అగచాట్లు పడాల్సి వస్తోంది. దీనికి తోడు సహకార సంఘాలకు పాలకవర్గాలు లేక రైతులకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. సహకార సంఘాలకు (సొసైటీలు) పాలకవర్గాలు లేకపోవడంతో పలు చోట్ల అధికారులు, సీఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోళ్లపై పర్యవేక్షణ కొరవడింది.
ఈ క్రమంలో వాతావరణ మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సహకార సంఘాలతో రైతులకు దగ్గరి సంబంధం ఉంటుంది. యూరియా, ఎరువులు, విత్తనాలు మొదలు పంటల కొనుగోలు వరకు సహకార సంఘాలు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 920 సహకార సంఘాలు ఉన్నాయి. వాటికి పాలకవర్గాల పదవీకాలం పూర్తికావడంతో పలువురు అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో పాలకవర్గాల నియామకంలో ప్రభుత్వం ఆలస్యం చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని అన్నదాతలు వాపోతున్నారు.
ప్రస్తుతం భారీగా ధాన్యం సేకరణ జరుగుతున్నప్పటికీ, సొసైటీల నుంచి సహకారం అంతంత మాత్రంగానే అందుతోందని రైతులు చెబుతున్నారు. సరిపడా కూలీలను ఏర్పాటు చేసి రోజుకు రెండు నుంచి మూడు కాంటాలు (తూకాలు) వేయాల్సి ఉండగా, కొన్ని చోట్ల ఒక్క కాంటాతోనే పనిని నెట్టేస్తున్నారు. దీంతో ధాన్యం కుప్పలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు అని రైతులు ఆరోపిస్తున్నారు. సొసైటీలకు పాలకవర్గాలు ఉంటే ఈ సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేవని రైతులు అభిప్రాయపడుతున్నారు.
శాఖల మధ్య సమన్వయ లోపం
ధాన్యం సేకరణలో పౌరసరఫరాల శాఖ, సహకార శాఖతో పాటు వ్యవసాయ, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్ శాఖలు కీలకంగా వ్యవహరించాలి. కానీ అధికారుల మధ్య సమన్వయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తూకం, రవాణా వంటి సమస్యలపై సొసైటీ అధికారులను అడిగితే అది తమ పరిధిలో లేదని దాటవేస్తున్నారు అని రైతులు విమర్శిస్తున్నారు. పాలకవర్గాలు ఉంటే రైతులు తమ సమస్యలను నేరుగా చైర్మన్, సభ్యుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం పొందగలిగేవారు అని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై దృష్టి సారించాలని, శాఖల మధ్య సమన్వయం పెంచాలని రైతులు కోరుతున్నారు.
లోడింగ్, అన్‌లోడింగ్‌లోనూ సమస్యలు
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 8,525 కొనుగోలు కేంద్రాల ద్వారా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 6,500 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే పలు చోట్ల కాంటా వేయడంలో ఆలస్యం, ధాన్యాన్ని లారీల ద్వారా రైస్ మిల్లులకు తరలించడంలో కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటుగా లారీలు ఏర్పాటు చేసుకుని మిల్లులకు తరలించినా, అక్కడ అన్‌లోడింగ్ చేయకపోవడంతో లారీ కిరాయిల భారం రైతులపై పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులైనా ధాన్యం అన్‌లోడ్ చేయకపోవడంతో రైతులు ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నారు. ధాన్యం బరువు తగ్గిపోతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
