Allu Arjun Fans | ’హ్యాపీ’ రీ రిలీజ్ తో అత్యధిక వసూళ్లు..
Allu Arjun Fans | ’హ్యాపీ’ రీ రిలీజ్ తో అత్యధిక వసూళ్లు..
Allu Arjun Fans |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్లు గడిచినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేరళం ప్రేక్షకుల అభిమానం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా 4కే హంగులతో మళ్లీ థియేటర్లలోకి వచ్చిన హ్యాపీ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. హ్యాపీనా ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనుకుంటున్నారా.. రిలీజైంది ఇక్కడ కాదండీ కేరళంలో.. అవునూ.. అల్లు అర్జున్ కు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో మలయాళంలోనూ అంతే ఫ్యాన్ ఫాలోయింగు ఉంది. అక్కడ బన్నీని ముద్దుగా మల్లు స్టార్ అని పిలుస్తారు ఫ్యాన్స్. అయితే ఇప్పటి వరకు విడుదలైనా బన్నీ సినిమాలు అన్నీ మలయాళలోనూ విడుదలై ఘన విజయాలు అందుకున్నాయి.
జూన్ 11న మలయాళ రూపంలో విడుదలైన ‘హ్యాపీ’ 4కేకు కొచ్చి, కోజికోడ్, తిరువనంతపురం సహా కేరళంలోని ప్రధాన నగరాల్లో మంచి స్పందన లభించింది. కొత్త చిత్రం విడుదలైన స్థాయిలో అభిమానులు థియేటర్లకు తరలిరావడం అల్లు అర్జున్‌కు అక్కడున్న ఆదరణను మరోసారి చాటుతోంది.
2026లో సరికొత్త రికార్డు!
‘హ్యాపీ’ రీ రిలీజ్ 2026లో కేరళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రంగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా రీ రిలీజ్ సినిమాలకు లిమిటెడ్ షోలు మాత్రమే ఉంటాయి. కానీ ‘హ్యాపీ’కి మాత్రం కొత్త సినిమా విడుదలను తలపిస్తున్నాయి అక్కడి థియేటర్లు. అల్లు అర్జున్ ప్రవేశ సన్నివేశాలు, పాటలు వచ్చినప్పుడు అభిమానులు డ్యాన్స్ తో రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
బన్నీ కాదు.. ‘మల్లు అర్జున్’
తెలుగు రాష్ట్రాల తర్వాత అల్లు అర్జున్‌కు అత్యధిక అభిమానులు ఉన్న ప్రాంతాల్లో కేరళం ముందుంటుంది. అందుకే కేరళ అభిమానులు బన్నీని ప్రేమగా ‘మల్లు అర్జున్’ అని పిలుస్తుంటారు. అల్లు అర్జున్ డ్యాన్స్, యాక్షన్ కి కేరళ యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘ఆర్య’, ‘హ్యాపీ’, ‘బన్నీ’, ‘దేశముదురు’ వంటి సినిమాలు ఆయనకు అక్కడ ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు.
థియేటర్‌కు వచ్చిన అనస్వర రాజన్
‘హ్యాపీ’ సినిమా రీ రిలీజ్ కు మలయాళ నటి అనస్వర రాజన్ కూడా అభిమానులతో కలిసి థియేటర్‌లో సందడి చేశారు. ఆమె రాకతో అభిమానుల సంబరాలు మరింత పెరిగాయి.
రెండు దశాబ్దాల తర్వాతా అదే ఆదరణ
2006లో విడుదలైన ‘హ్యాపీ’ చిత్రానికి ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో యువతను ఆకట్టుకుంది.
కేరళలో ‘హ్యాపీ’ సృష్టిస్తున్న సందడి చూస్తుంటే.. బన్నీపై అక్కడి ప్రేక్షకుల ప్రేమ కేవలం ఒక సినిమా వరకే పరిమితం కాలేదని స్పష్టమవుతోంది. రెండు దశాబ్దాలు గడిచినా అదే స్థాయి ఆదరణ కొనసాగడం అల్లు అర్జున్ ప్రత్యేకతకు నిదర్శనంగా నిలుస్తోంది.
