నిధుల కొరతతో ఇబ్బందుల్లో మత్స్యకారులు

నిధుల కొరతతో ఇబ్బందుల్లో మత్స్యకారులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మత్స్యశాఖ గత రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం నిర్దేశించిన స్థాయిలో అమలు కావడంలేదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాది అరకొరగా చేపపిల్లలను పంపిణీ చేయగా, రెండో ఏడాది కూడా ఆశించిన స్థాయిలో పంపిణీ జరగలేదు. దీంతో రెండేళ్లుగా మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదైనా మత్స్యకారుల అభ్యున్నతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారని భావించిన వారికి నిరాశే మిగిలింది. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి కీలకమైన ఈ పథకానికి ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో కేవలం రూ.16 కోట్లు మాత్రమే కేటాయించడంపై మత్స్య సహకార సంఘాలు మండిపడుతున్నాయి.
అరకొర బడ్జెట్‌తో చేపపిల్లల పెంపకం ఎలా?
ఏటా రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు, జలాశయాల్లో చేపపిల్లల పెంపకం కోసం అవసరమైన నిధులు పరిశీలిస్తే ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం ప్రశ్నార్థకంగా మారుతోంది. గతేడాది కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. చేపపిల్లల కొనుగోలు, రవాణా, చెరువుల్లో వదిలే ప్రక్రియలకు తగిన నిధులు లేకపోవడంతో చివరి నిమిషంలో బీసీ సంక్షేమశాఖ నుంచి నిధులు మళ్లించాల్సి వచ్చింది అని మత్స్య సహకార సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. ఇలా ఇతర శాఖల నుంచి నిధులు మళ్లించడం వల్ల నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా చేపపిల్లల పంపిణీ జరుగుతోంది. దీని ప్రభావం వాటి పెరుగుదలపై ప్రతికూలంగా పడుతోందని వారు అంటున్నారు.
ఏటా 90 కోట్ల చేపపిల్లలు అవసరం
రాష్ట్రవ్యాప్తంగా ఏటా సుమారు 90 కోట్ల చేపపిల్లలు అవసరమవుతాయి. వాటి కొనుగోలుతో పాటు చెరువుల వరకు తరలించేందుకు కూడా భారీగా నిధులు అవసరం. నిధుల కొరత వల్ల చేపపిల్లల పంపిణీ ఆలస్యమైతే దాని ప్రభావం తమ జీవనోపాధిపై పడుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించినప్పటికీ, అమలు విషయంలో ఇతర పద్దుల నుంచి నిధులు వినియోగించవచ్చని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయంపై మత్స్యకార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
