నైరుతి రుతుపవనాలతో కృష్ణా డెల్టాలో ముందస్తు వరి సాగుకు ఊపు
నైరుతి రుతుపవనాలతో కృష్ణా డెల్టాలో ముందస్తు వరి సాగుకు ఊపు
జూలైలో సాగునీటి విడుదలకు ప్రభుత్వం నిర్ణయం – తుఫాన్ల నష్టాల నుంచి పంటలకు రక్షణ
13.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు రైతుల సన్నాహాలు ముమ్మరం
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో కృష్ణా డెల్టా వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ వరి సాగు కోసం ముందస్తు సన్నాహాలు ప్రారంభించారు. పొలాలను దున్నడం, నారుమడులు సిద్ధం చేయడం, విత్తనాల నాటకం వంటి వ్యవసాయ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
సాంప్రదాయంగా రైతులు ఎద్దులు, ట్రాక్టర్ల సహాయంతో పొలాలను దున్ని నారుమడులు సిద్ధం చేస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భూమిలో తగినంత తేమ ఏర్పడటంతో వ్యవసాయ పనులకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు రాయితీ ధరలపై నాణ్యమైన విత్తనాలను వ్యవసాయ శాఖ అందించడంతో నారుమడుల తయారీ మరింత ఊపందుకుంది.

వ్యవసాయానికి ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం జూలై మొదటి వారంలో కృష్ణా డెల్టా కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. దీనివల్ల రైతులు ముందుగానే వరి నాట్లు పూర్తి చేసుకునే అవకాశం లభించనుంది. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో సంభవించే తుఫానులు, భారీ వర్షాల వల్ల కలిగే పంట నష్టాలను నివారించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని రైతులు భావిస్తున్నారు.
కృష్ణా డెల్టా పరిధిలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 13.08 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. ముందస్తు సాగు ద్వారా దిగుబడులు పెరగడంతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించవచ్చని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.
కృష్ణా తూర్పు డెల్టా పరిధిలోని కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు జూలై 1 నుంచి సాగునీరు విడుదల చేయనుండగా, అనంతరం కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు నీటిని అందించనున్నారు.
విజయవాడ రూరల్, గన్నవరం, ఉంగుటూరు, గుడివాడ, అవనిగడ్డ, కోడూరు, ఉయ్యూరు, పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు తదితర ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే పొలాల దున్నకం, నారుమడుల తయారీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా చెరువులు, బోరుబావుల ఆధారంగా రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు.
అనుకూలమైన రుతుపవన పరిస్థితులు, సకాలంలో సాగునీటి విడుదలతో ఈ ఏడాది కృష్ణా డెల్టాలో వరి సాగు విజయవంతమవుతుందనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది.
