TG | మొహర్రం ఉత్సవాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా..

TG | మొహర్రం ఉత్సవాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా..

  • పాతబస్తీలో క్షేత్రస్థాయిలో పర్యటించిన టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్
  • భారీ వర్షాల నేపథ్యంలో హై అలర్ట్‌లో ఉండాలని అధికారులకు ఆదేశాలు

ఆంధ్రప్రభ: భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను అప్రమత్తంగా ఉంచాలని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆయన ఆదివారం పాతబస్తీ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి విద్యుత్ సరఫరా పరిస్థితులను సమీక్షించారు.

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని అధికారులు, సిబ్బంది హై అలర్ట్‌లో ఉండాలని సూచించిన సీఎండీ, భారీ వర్షాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

TG

బీబీ కా ఆలం మార్గం పరిశీలన..

ఈ నెలలో (జూన్ 16 నుంచి) ప్రారంభం కానున్న మొహర్రం ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించే బీబీ కా ఆలం ఊరేగింపు మార్గాన్ని జితేష్ వి. పాటిల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దబీర్‌పురాలోని బీబీ కా ఆలవా నుంచి చాదర్‌ఘాట్‌లోని మస్జిద్-ఎ-ఇలాహీ వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర సాగే ఊరేగింపు మార్గంలో విద్యుత్ సరఫరా ఏర్పాట్లు, భద్రతా చర్యలను అధికారులతో కలిసి సమీక్షించారు.

మొహర్రం సందర్భంగా భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని, అవసరమైతే అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు) ఏర్పాటు చేసి వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ఫిర్యాదులపై తక్షణ స్పందన

అనంతరం అస్మాన్‌గఢ్ ప్రాంతాన్ని సందర్శించిన సీఎండీ, వర్షాకాలం మరియు మొహర్రం ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినియోగదారుల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని బృందాలు సిద్ధంగా ఉండాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజినీర్ (మెట్రో జోన్) బిక్షపతి, హైదరాబాద్ సౌత్ సర్కిల్ అధికారులు, అస్మాన్‌గఢ్ డివిజనల్ ఇంజినీర్ విష్ణువర్ధన్, చార్మినార్ డివిజనల్ ఇంజినీర్ శ్రీధర్, ఇతర విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply