నేటితో అంతా గప్ చుప్..

నేటితో అంతా గప్ చుప్..

రాష్ట్రమంతా ఆసక్తితో ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కీలక ఘట్టం ముగియనుంది. సీఎం, కేంద్రమంత్రులతో సహా రాష్ట్రంలోని ప్రధాన పార్టీల కీలక నేతలు, అధ్యక్షులు, మంత్రులు హోరాహోరిగా చేస్తున్న ప్రచారం నేటి సాయంత్రానికి పరిసమాప్తం కానుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి. మద్యం దుకాణాలు బంద్ కానుండగా నియోజకవర్గంలో రెండు రోజులు పాటు 144 సెక్షన్ అమలులో ఉండనున్నది. నియోజకవర్గానికి సంబంధం లేని నేతలు బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

పార్టీలు అన్నీ సరుకుసరంజామా సెట్ చేసుకుంటున్నాయి. అసలైన ప్రలోభాలు, పంపకాలు నేటి నుంచి జోరుగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఓటుకు ఎంతైనా సరే అంటున్న పార్టీలు ఇప్పటికే మద్యం, నగదు చేరాల్సిన చోటుకు చేర్చినట్టుగా అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్, కౌంటింగ్ రోజున జూబ్లీహిల్స్ పరిధిలో ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. నిర్ధేశించిన సమయాల్లో మద్యం షాపులన్నీ మూసివేయాలని సీపీ ఆదేశించారు. అలాగే జూబ్లీహిల్స్ పరిధిలో హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పోలింగ్ రోజున, ఓట్లు లెక్కింపు రోజున 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు ఎవరూ గుమిగూడవద్దని సీపీ తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున రోడ్లు, జనావాసాల్లో టపాసులు పేల్చడం నిషేధమని సీపీ పేర్కొన్నారు.

Leave a Reply