అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి…

అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి…

వేసవి తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తప్పనిసరి
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు, హీట్‌వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. ఈ మేర‌కు ఆయ‌నిక్క‌డ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.

ఒక‌వేళ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే తలకు టోపీ, గుడ్డ లేదా గొడుగు ఉపయోగించడంతో పాటు స్వ‌చ్ఛ‌మైన తాగునీరు, మ‌జ్జిగ వంటి వాటిని వెంట తీసుకెళ్లాల‌న్నారు. శరీరంలో నీరసం రాకుండా తరచూ మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించారు. వేసవి తీవ్రత కారణంగా హీట్‌స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున తలనొప్పి, తల తిరగడం, అధిక చెమటలు, అలసట, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు.

చిన్నారులను ఎండలో ఆడనివ్వకుండా చూడాలని, కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు తరచూ విరామాలు తీసుకుంటూ నీరు తాగాలని సూచించారు. రైతులు, నిర్మాణ కార్మికులు, ట్రాఫిక్ సిబ్బంది వంటి వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు హీట్‌వేవ్ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు.

Leave a Reply