ప్రశ్నిస్తే తొలగిస్తారా?

ప్రశ్నిస్తే తొలగిస్తారా?
చంద్రబాబు సర్కారుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించడం (డిస్మిస్ చేయడం)పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రశ్నించే వారిపై వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. “ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక భయంతోనే ఇటువంటి అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటోంది” అని విమర్శించారు.
అశోక్ బాబుకు ఓ నీతి.. వెంకట్రామిరెడ్డికి మరో నీతా?
ఈ సందర్భంగా టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యవహారాన్ని జగన్ ప్రస్తావించారు. “గతంలో అశోక్ బాబుపై ఆరోపణలు వచ్చినప్పుడు ఒకలా, ఇప్పుడు వెంకట్రామిరెడ్డి విషయంలో మరోలా వ్యవహరించడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనం” అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తోందని, ఒక ఉద్యోగ సంఘ నేతను ఇలా తొలగించడం సరికాదని హితవు పలికారు.
