చైన్ స్నాచింగ్ కేసులో మలుపు…

చైన్ స్నాచింగ్ కేసులో మలుపు…

ఇద్దరిలో ఒకరి అరెస్ట్
పల్సర్ బైక్ స్వాధీనం..
అంతర్రాష్ట్ర భవారియా గ్యాంగ్ దుశ్చర్యలు వెలుగులోకి

కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు పట్టణంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించగా కీలక పురోగతి సాధించారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి, వారి వద్ద ఉపయోగించిన పల్సర్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు టెక్నికల్ ఆధారాలతో నిందితులను గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని షాంలి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులు మానవ్, హరి ప్రకాష్‌లుగా గుర్తించగా, వారిలో మానవ్‌ను బాలాజీ నగర్‌లో అరెస్ట్ చేశారు.

ఘటన వివరాలు..

ఏప్రిల్‌ 9న రాత్రి 8 గంటల సమయంలో గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలోని సాయినాథ్ నగర్‌లో ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటి బయట నడుస్తున్న ఓ వివాహిత మెడలోని బంగారు గొలుసును హెల్మెట్లు ధరించిన ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి లాక్కొని పారిపోయారు. ఈ మేరకు క్రైం నం. 88/2026గా కేసు నమోదు చేశారు.

అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో సంతోష్ నగర్‌లో నాగమణి అనే వృద్ధురాలు ఇంటి బయట కూర్చుని ఉండగా ఇద్దరు దుండగులు ఆమెను బెదిరించి కత్తి చూపించి గొలుసు లాక్కొన్నారు. బాధితురాలు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు బయటకు రావడంతో దుండగులు బైక్‌పై పారిపోతుండగా, మనవడు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వాహనం అదుపుతప్పింది. వెంటనే ఇద్దరూ బైక్ వదిలి తలో దిక్కు పారిపోయారు.

పోలీసుల చాకచక్యం..

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మోటార్ సైకిల్, ఒక కీప్యాడ్ మొబైల్ ఫోన్, బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలపై దర్యాప్తు కొనసాగించి నిందితులను గుర్తించారు. అరెస్ట్ చేసిన మానవ్ వద్ద నుంచి దొంగిలించిన చైన్‌లో భాగమైన 2 గ్రాముల బంగారు గొలుసు ముక్కను సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అంతర్రాష్ట్ర గ్యాంగ్ లింకులు..

పోలీసుల విచారణలో నిందితులు ఈ నెల 7న బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి అనంతపురం వచ్చి కొవ్వూరు నగర్‌లో AP39 JS 2653 నెంబర్ గల పల్సర్ బైక్‌ను దొంగిలించినట్లు తేలింది. అదే బైక్‌తో కర్నూలులో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్‌పై బెంగళూరు పరిసర ప్రాంతాల్లో 16కి పైగా కేసులు ఉండగా, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా 15కి పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు సమాచారం.

మిగిలిన నిందితుడి కోసం గాలింపు..

మరో నిందితుడు హరి ప్రకాష్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఇతర రాష్ట్రాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. కర్నూలులో ఇటీవల పెరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Leave a Reply