AP | మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్

  • అట‌వీ భూముల ఆక్ర‌మ‌ణల‌పై విచార‌ణ క‌మిటీ
  • అక్ర‌మ‌ణ‌ల‌పై నివేదిక ఇవ్వాల‌ని ప‌వ‌న్ అధికారుల‌కు అదేశం

చిత్తూరు : మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జెర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు అయింది. జాయింట్ కమిటీలో సభ్యులుగా చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మనికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోద బాయ్ ఉన్నారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.

ప‌వ‌న్ కల్యాణ్ సీరియ‌స్..

మరోవైపు వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యణ్ సీరియస్ అయ్యారు. అటవీ భూముల అక్రమాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమణలు చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. విచారణ చేసి సత్వరమే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పిసిసిఎఫ్‌కు ఆదేశించారు.

పవన్ కళ్యాణ్ కామెంట్స్..

అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు.. అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని, పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు ఇవ్వాలని.. వాటి రికార్డులను పరిశీలించి, ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా… చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరు.. తద్వారా లబ్ధి పొందింది ఎవరు.. అనేది నివేదికలో వివరించాలన్నారు. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని సూచించారు.

Leave a Reply