పంటపొలాల్లో ఏనుగుల హల్చల్
పంటపొలాల్లో ఏనుగుల హల్చల్
భారీ నష్టం
పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు జిల్లా ( Chittoor district) బంగారుపాళ్యం మండలంలోని టేకుమంద గ్రామపంచాయతీ పరిధిలో గజరాజుల హింస మళ్లీ తీవ్రరూపం దాల్చింది. సోమవారం రాత్రి అటవీ ప్రాంతం నుంచి బయలుదేరిన 11 గజరాజుల గుంపు గ్రామానికి సమీపంలోని మాజీ సర్పంచి రత్నయ్య, రైతులు వెంకటరమణ, సుబ్రహ్మణ్యం, నారాయణలు తదితరుల పంట పొలాల్లోకి చొరబడి భారీ నష్టం మిగిల్చాయి. వరి, మామిడి, అరటి పంటలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు రైతులు తెలిపారు.
సుమారు లక్ష రూపాయల విలువైన పంటలు నాశనం అయినట్లు అంచనా. సీజన్ మొత్తం కష్టపడి పండించిన పంటలను గజరాజులు రాత్రికిరాత్రే తినేసి, నేలమట్టం చేస్తున్నాయి. చేతికి అందే టైంలో ఇలా నష్టం రావడం మనసు పగిలే విషయమని రైతులు ఆవేదన (Farmers distressed) వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలమనేరు అటవీ అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా పెద్దగా స్పందన లేకపోవడం దారుణమని రైతులు మండిపడ్డారు. గజరాజుల సమస్య బంగారుపాళ్యం, టేకుమంద, దొరసానిపల్లి, సిదులగట్టె, గొర్రెపల్లి గ్రామాల్లో విస్తృతమైంది. గత మూడు నెలల్లో బంగారుపాళ్యం మండలంలోనే ఐదుసార్లు గజరాజుల దాడులు జరిగి దాదాపు 6 లక్షల రూపాయల పంటలు నాశనమయ్యాయని రైతులు తెలిపారు. అక్టోబర్ నెలలో టేకుమంద సమీపంలో ఒక రైతు గజరాజుల దాడిలో గాయపడిన ఘటన కూడా చోటుచేసుకుంది.

ఇదే సంవత్సరం జూలై నెలలో బంగారుపాళ్యం (Bangarupalyam) మండలంలోని మొగిలి-మిట్టూరు గ్రామాల మధ్య ఒక గున్న ఏనుగు బావిలో పడిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. బావిలో పడి కేకలు వేసిన ఏనుగు పిల్లను గ్రామస్తులు, అటవీశాఖ అధికారులు (Forest officials) అత్యంత కష్టపడి రక్షించారు. సుమారు ఆరు గంటలపాటు సాగిన ఆ ఆపరేషన్ తర్వాత చిన్న గజరాజును సురక్షితంగా బయటకు తీసి అడవిలోకి పంపించారు.
ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నప్పటికీ అటవీశాఖ నుంచి సరైన చర్యలు లేకపోవడం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే గజరాజుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలంటూ రైతులు డిమాండ్ చేశారు.
