అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి : సీఎం

అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి : సీఎం

ఉమ్మ‌డి రంగారెడ్డి బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(Andeshri) కి ప‌ద్మ‌శ్రీ ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఘ‌ట‌కేస‌ర్‌లో జ‌రిగిన‌ అందెశ్రీ అంతియ యాత్రలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao), కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్, అందెశ్రీ అభిమానులు, సాహితీ ప్రియులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఆయన అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పుకొచ్చారు. అలాగే ఆయన తెలంగాణ కోసం చేసిన సేవలను గుర్తుంచుకొని.. పాఠ్య పుస్తకాల్లో జయ జయహే తెలంగాణ గీతం(Jaya Jayahe Telangana song) పెడతామని అన్నారు.

అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని, త్వరలోనే అందెశ్రీ స్మృతివనం ఏర్పాటు చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పాటల సంకలనం “నిప్పుల వాగు(Nippula Vagu)” ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్‌గా ఉపయోగపడుతుందని, ఆయన రచనలతో 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీ‌లో నిప్పుల వాగు ను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

అలాగే అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్ దీనికి సహకరించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగా కలిసి అందెశ్రీని పద్మశ్రీ తో గౌరవించుకునేందుకు కృషి చేద్దామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply