కొనుగోళ్లలో ధాన్యం కటింగ్ చేయొద్దు…

కొనుగోళ్లలో ధాన్యం కటింగ్ చేయొద్దు…

  • కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైతుల ధాన్యంలో ఎలాంటి కోతలు (కటింగ్‌లు) విధించవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకత పాటించాలని సూచించారు.

ఎవరైనా రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, రైతులకు అన్యాయం చేసినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన ధాన్యాన్ని మాత్రమే రైస్ మిల్లులకు తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల ధాన్యంలో కటింగ్‌లు విధించవద్దని స్పష్టం చేశారు.

అలాగే కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన 100 శాతం ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2 నాటికి జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేసి కేంద్రాలను మూసివేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో డీఆర్‌డీఓ కాలిందిని, డీసీఓ శ్రీమాల, ఏపీఎంలు, ఏపీఓలు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.