పూడికతీత పనులకు శంకుస్థాపన..

ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపూర్‌లోని ఊర చెరువులో సుమారు రూ.1 కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న పూడికతీత పనులకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు చెరువుల నిల్వ సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. దీంతో వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.
ముఖ్యంగా వర్షాకాలంలో గోపాలపూర్ పరిసర ప్రాంతాల్లో తరచుగా ఎదురయ్యే వరద ముంపు సమస్యలను తగ్గించడంలో ఈ పూడికతీత పనులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు ప్రజల సహకారం కూడా అవసరమని, చెరువుల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
