AP | విద్యుత్ బస్సుల విస్తరణకు శ్రీకారం..
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రజా రవాణాను మరింత పర్యావరణ హితంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,450 విద్యుత్ బస్సులను అద్దె ప్రాతిపదికన సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం సొంతంగా టెండర్లు పిలవనుంది.
ఈ విధానంలో బస్సులను గుత్తేదారు సంస్థలు అందించినప్పటికీ, వాటిని నడిపే డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులుగానే కొనసాగుతారు. దీంతో ప్రయాణికులకు ఆర్టీసీ సేవల నాణ్యతలో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు భావిస్తున్నారు.
విద్యుత్ బస్సులు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఇంధన వ్యయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తాయి. ఈ బస్సులు ఒక్క కిలోమీటరు ప్రయాణానికి సుమారు 1.2 యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో దశలవారీగా విద్యుత్ బస్సుల సంఖ్యను పెంచి, పట్టణాలతో పాటు ప్రధాన రహదారులపై కూడా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక రూపొందిస్తోంది.
