Exclusive – ఎపి మండలిలో పెద్ద‌లెవ‌రో? మూడింటిపై పీట‌ముడి

టీడీపీ సొంతగూటిలోనే అలజడి
చాతుర్యం చూప‌నున్న చంద్ర‌బాబు
మిత్ర లాభానికే తొలి ప్రాధాన్యం
జ‌న‌సేన నుంచి నాగ‌బాబుకు చాన్స్‌
బీజేపీ నుంచి ఎవ‌రికి ద‌క్కేనో?
మిగిలిన మూడు స్థానాల కోసం ఆందోళన
పిఠాపురం స్థానం.. వర్మకు ద‌క్కేనా?
మ‌రో రెండింటిలో మోపిదేవి, బాలినేని ఫిక్స్‌?
తెలుగు తమ్ముళ్లలో పెద్ద‌ల స‌భ‌ హైరానా

సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ:

ఏపీ అసెంబ్లీ లాబీలోనూ..పార్టీ పెద్దల అంతర్గత మందిరాల్లో రహస్య మంతనాలతో ఆశావహులు తపించిపోతున్నారు. ఎమ్మెల్సీ వరంంతోనే టీడీపీ నేత వర్మ‌ పిఠాపురం అసెంబ్లీ సీటను పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు. ఈ స్థితిలో ఎట్టి పరిస్థితిలోనూ వర్మకు ఎమ్మెల్సీ యోగం కల్పించాలని టీడీపీ అధినేత నిర్ణయానికి వచ్చారు. ఇక మూడు స్థానాల్లో ఒకటి వర్మకు ఇస్తే.. మిగిలిన రెండు స్థానాల కోసం తెలుగు తమ్ముళ్లు.. అటు లోకేష్ ను, ఇటు అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు.

జనసేన ఖుషీ.. ఖుషీ

ఎమ్మెల్యే కోటాలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అంగీకారం కుదిరింది. ఇంతకుముందే నాగబాబుకు మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అయింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఆయన మంత్రిగా ప్రమాణం చేయించాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగినంతనే అభ్యర్థుల ఎంపిక ఊపందుకోగా.. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో చంద్రబాబు, పవన్ సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో నాగబాబు అభ్యర్థిత్వం ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మండలిలో జనసేన తరపున పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన నాగబాబును ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో పాటు కందుల దుర్గేష్ మంత్రి వర్గంలో ఉన్నారు. ఇక నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే ప్రకటించడంతో మూడో మంత్రి పదవి కూడా జనసేనలో అదే సామాజిక వర్గానికి దక్కనుంది.

కమల ధీరుడెవరో?

బీజేపీకి ఒక ఎమ్మెల్సీ పదవి ఖాయం అనేది తెలుస్తోంది. ఈ సీటు ఎవ‌రికి దక్కుతుంద‌నే విష‌యంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ఒక్క పోస్ట్ కోసం గోదావరి జిల్లాల నేతలు, రాయలసీమ బీజేపీ సీనియర్లు పోటీలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దలు మాత్రం ఉత్తరాంధ్రకు, అదీ బీసీలకే ఈ పదవి ఇవ్వాలని అనుకుంటున్న‌ట్టు సమాచారం. కాగా, రాయలసీమలోనూ పార్టీ బలోపేతం కావాలంటే.. ఈ ప్రాంత బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని సీమ నేతలు పట్టుబడుతున్నారు. ఈ స్థితిలో బీజేపీకి దక్కే సీటు ఉత్తరాంధ్ర నేతలకా? రాయలసీమ వారికా? నడుమ కోస్తా లీడర్లకా? అనేది ఉత్కంఠగా మారింది.

టీడీపీలో అంతర్మథనం

ఈ అయిదు సీట్లల్లో మూడింటిలో ఒకటి ఫిఠాపురం వర్మకు దక్కితే.. మిగిలిన రెండు స్థానాల కోసం టీడీపీ ఆశావహుల జాబితా పెద్ద జాబితా ఉంది. ఎన్నికల పొత్తులో భాగంగా సీట్లు దక్కని వారంతా ఎమ్మెల్సీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రులూ ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ ను ప్రసన్నం చేసుకోడానికి ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కోసం వారి అనుచ‌రులు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఆశిస్తున్న పలువురు నేతలు అసెంబ్లీలో చక్కర్లు కొడుతున్నారు. మరో వైపు మాజీ మంత్రులు కేఎస్ జవహర్, పీతల సుజాత, కేఈ ప్రభాకర్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, విశాఖకు చెందిన మహ్మద్ నజీర్ అసెంబ్లీలో దర్శనం ఇచ్చారు. దువ్వారపు రామారావుకు మళ్లీ అవకాశం కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరాలని విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మె ల్యేలు సోమవారం రాత్రి సమావేశమై నిర్ణయించారు. శాసనసభ ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేసే అవకాశం కోల్పోయిన వారంతా ఎమ్మెల్సీ కోసం పోటీపడుతున్నారు.

కృష్ణా జిల్లా నేతలకు కష్టకాలం..

టీడీపీకి మిగిలిన మూడు స్థానాల్లో పిఠాపురం వర్మకు కేటాయిస్తే.. మరో స్థానం కోసం మోపిదేవి వెంకట రమణ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన రాజ్యసభ్యకు రాజీనామా చేసి మరీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గట్టి షాక్ ఇచ్చారు. మళ్లీ రాజ్యసభకు వెళ్లేది లేదని ఇస్తే గిస్తే ఎమ్మెల్సీ ఇవ్వండని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు మొర పెట్టుకున్నారని సమాచారం. ఇక ప్రకాశం జిల్లా నేత బాలిరెడ్డి శ్రీనివాస రెడ్డి సైతం ఎమ్మెల్సీ సహా మంత్రి బెర్త్ కోసం పెద్ద యజ్ఞమే చేసినట్టు సమాచారం. ఆయన కోసమే ఓ ఎమ్మెల్సీ తన పదవిని త్యాగం చేశారని పొలిటికల్ కబుర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే జరిగితే.. మిగిలిన రెండు సీట్లూ… వైసీపీ నుంచి వచ్చిన నేతలకు ప్రసాదిస్తే.. ఎమ్మెల్సీ సీటుపై గంపెడు ఆశలు పెట్టుకున్న టీడీపీ తమ్ముళ్లు మరో సారి త్యాగరాజుల పాత్ర పోషించక తప్పదు.

అంత‌ర్గ‌త కుమ్ములాట‌లే..

ఇటు బుద్ధ వెంకన్నకు, అటు దేవినేని ఉమకు ఎవరికి సీటు ఇచ్చినా.. కృష్ణాజిల్లా టీడీపీలో అంతర్గత కుమ్ములాట తారా స్థాయికి చేరటం ఖాయం. సీనియర్ నాయకుడు , మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రిని కాదని.. మాజీ ఎమ్మెల్సీకి పట్టం కడితే.. కృష్ణాజిల్లాలో టీడీపీకి మరో దెబ్బ ఖాయమని ఇప్పటికే ఇంటిలిజెన్స్ రిపోర్టులు పార్టీ అధినేతకు అందినట్టు సమాచారం. ఏది ఏమైనా రేపు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చించిన మీదటే ఏపీ ఎమ్మెల్సీ సీట్లను టీడీపీ అధినేత ఖరారు చేస్తారు. రాజ్యసభ సీటును తాము త్యాగం చేస్తామని, అసెంబ్లీ ఎమ్మెల్సీ సీటును తమకు వదలాలని టీడీపీ ఛీఫ్ కోరే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. కూటమిలో మిత్రులను ఓదార్చి సముదాయించగలిగే సత్తా ఉన్నా చంద్రబాబు నాయుడు తన సొంత గూటి పక్షులను ఏరీతిలో ఊరడిస్తారో? వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *