వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పర్యటన
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే..
తక్షణ చర్యలకు అధికారులకు ఆదేశాలు
గోదావరిఖని, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ బుధవారం రాత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించాలని, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు అందించడంలో నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నారు.
వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఎమ్మెల్యే కోరారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు.
