పరిశ్రమల అభివృద్ధికి వేగం.. పురోగతిపై కలెక్టర్ కృతిక శుక్లా సమీక్ష

నరసరావుపేట, ఆంధ్రప్రభ: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలపై జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా దృష్టి సారించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో పరిశ్రమల పురోగతి, పారిశ్రామిక అనుమతులు, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఎస్‌.వి. సురేష్ కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను సమర్పించారు. అనంతరం కలెక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు, వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.

సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వివిధ శాఖలకు వచ్చిన పారిశ్రామిక అనుమతుల దరఖాస్తుల స్థితిగతులను పరిశీలించిన కలెక్టర్, అన్ని దరఖాస్తులు నిర్ణీత గడువులోనే పరిష్కరించినట్లు కన్వీనర్ సురేష్ వివరించారు.

ఈ సందర్భంగా ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ జిల్లాలోని పారిశ్రామిక పార్కుల పురోగతిపై నివేదిక సమర్పించారు. పారిశ్రామిక పార్కుల్లో కొనసాగుతున్న సివిల్ పనులు, మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. అలాగే జిల్లాలో వివిధ దశల్లో ఉన్న పారిశ్రామిక యూనిట్ల అమలు స్థితిగతులపై కూడా సమీక్ష నిర్వహించారు.

పరిశ్రమల శాఖ, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన వివిధ క్లస్టర్ల పురోగతిని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఝాన్సీరాణి వివరించారు. పీఎంఈజీపీ పథకం పాత పోర్టల్ సేవలు నిలిపివేసి, త్వరలో కొత్త వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. డెయిరీ యూనిట్లను పశుసంవర్ధక శాఖ ద్వారా మరింత ప్రోత్సహించాలని సూచించారు.

అదేవిధంగా పీఎం విశ్వకర్మ పథకం అమలు పురోగతి, కేపీఐఎస్ కింద గత డీఐఈపీసీ సమావేశం నుంచి ఇప్పటివరకు నమోదైన కొత్త ఎంఎస్‌ఎంఈ యూనిట్ల వివరాలను సమావేశంలో సమీక్షించారు.

ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ సర్వేలో భాగంగా 3,422 యూనిట్లను వెబ్ పోర్టల్‌లో నమోదు చేసిన విషయాన్ని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.